కామారెడ్డి, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభించుకున్న సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించాలని, ఉదయం 8:30 గంటల లోపు గ్రామాల్లో ఉండాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా గ్రామాలలో పచ్చదనం, పారిశుద్ధ్యం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్ల చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఉండేవిధంగా చూడాలని, పల్లె ప్రకృతి వనాల్లో వంద శాతం మొక్కలు జీవించి ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయతీ సెక్రెటరీల సంఘం జనరల్ సెక్రెటరీ ఆశం రామకృష్ణ, ప్రతినిధులు రాజేందర్, క్యాకప్ప, రమేష్, అమర్నాథ్, మూకీధ్, బాపురావు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.