నిజామాబాద్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ డిఎం ఇ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు వేతనాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివో 60 సవరించాలని, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
ప్రజల ఆరోగ్యం సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా పేషెంట్‌లకు సేవలందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జీవో 60 ను సవరించి కార్మికుల వేతనాలు పెంచడంతోపాటు పండుగ జాతీయ సెలవులు అమలు చేయాలన్నారు.
కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట్, కవిత, లింగం, యాదగిరి, లక్ష్మి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.