నిజామాబాద్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మేయర్ దండు నీతూ కిరణ్ క్యాంప్ ఆఫీస్‌లో ఏఐటియుసి మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై వితని పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలు అపరిష్క ృతంగా పెరిగిపోతున్నాయని వాటి పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన పరిష్కరించడం లేదన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగర కార్పొరేషన్ పాలకవర్గానికి మంచి పేరు తీసుకు రావడానికి సుందరమైన నగరంగా నిజామాబాద్ తీర్చిదిద్దడానికి అహర్నిశలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల అధికారులు ప్రభుత్వం మానవతా దృక్పథంతో పని చేయాల్సిన అవసరముందన్నారు.
పర్మినెంట్ కార్మికులకు బట్టలు, సబ్బులు, చెప్పులు, నూనెలు, రెండు జతల బట్టలు కుట్టు కూలి బకాయిలు చెల్లించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు కొత్త పిఆర్‌సి వర్తింపజేసి అదనపు వేతనాన్ని పెంచి జూన్ నెల నుంచి ఇవ్వాలని, నూతనంగా ఏజెన్సీ ద్వారా నియమింపబడ్డ కార్మికులకు మూడు నెలలు అవుతున్నా వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమని, వారికి బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు జూన్ నెల నుండి కొత్త పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లిస్తూ మిగతా కార్మికులకు ఇచ్చే పనిముట్లు, పిఎఫ్, ఈఎస్‌ఐ, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.
మానవతా దృక్పథంతో చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, 20 వేల రూపాయల మట్టి ఖర్చులు నిమిత్తం కార్పొరేషన్ ద్వారా సహాయం చేయాలన్నారు. పర్మినెంట్ కార్మికుల పాత డిఎ బకాయిలు చెల్లించాలని, తోపుడు బండ్లు చీపుర్లు ఇవ్వాలన్నారు.
సమస్యలపై సానుకూలంగా స్పందించిన మేయర్ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, నాయకులు బిక్షపతి, రాజేష్, నరసమ్మ, చిన్ను బాయ్, ధర్మవ, మోహన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.