నిజామాబాద్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రదర్శనగా బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిరచారు. అనంతరం అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగంలో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగులైన శానిటేషన్, పేషెంట్ సెక్యూరిటీ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. అనారోగ్యాల బారిన పడ్డ పేద ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన సందర్భంలో వారి ఆరోగ్యాలను కాపాడడానికి శానిటేషన్ సిబ్బంది ఆసుపత్రిని శుభ్రం చేస్తూ, పేషెంట్ కేర్ సిబ్బంది రోగులకు సేవలు చేస్తూ సమయానికి మందులు వేస్తూ చేతగాని పేషంట్‌లను డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి వారి పరిస్థితిని వివరించి వారి ఆరోగ్యం బాగుకు కృషి చేస్తూ, సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రి కాపలా కాస్తూ సేవలు చేస్తు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ వేతనాలు పెంచారు కానీ వీరికి పెంచకపోవడం సిగ్గుచేటన్నారు.
నిత్యం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామని ప్రగల్బాలు పలికే ప్రభుత్వం తమ ప్రాణాల్ని ఘనంగా పెట్టి ప్రజల్ని కాపాడుతున్న సిబ్బంది వేతనాలు ఎందుకు పెంచ లేదో తెలియజేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కాలపరిమితి ముగిసిన కాంట్రాక్టులను రద్దు చేసి, కార్మికుల వేతనాలు పెంచాలని లేనియెడల సమ్మె కైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పీ. నర్సింగరావు, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్, నాయకులు కవిత, వెంకట్, లింగం, అనురాధ, లక్ష్మి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.