వేల్పూర్, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్ స్వాతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వివిధ శాఖల అధికారులు మహిళలు, యువకులు గ్రామస్తులు గ్రామ సభకు విచ్చేసి విజయవంతం చేశారు.
గ్రామ సభలో కార్యదర్శి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను, చేపట్టే అభివృద్ధి పనులను, గ్రామ సభలో గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు, గ్రామంలో సిసి రోడ్లు, సిసి డ్రైనేజీలు, పలు సమస్యలను గ్రామ సభలో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వాతి మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని గ్రామ సభలో గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
తాగునీటి సమస్యలను సైతం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకంలో భాగంగా గుంతలు తవ్వి చెట్లను మొక్కలను నాటి విజయవంతం చేస్తామని ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్ విచ్చేసి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించగా పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు మెరుగు పరుస్తామని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి గ్రామస్థులు సైతం సహకరించాలని ప్రజాప్రతినిధులు విన్నవించారు. గ్రామ సభలో తీర్మానం చేసిన సమస్యలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.