హైదరాబాద్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27వ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభం కానున్న అఖిలపక్ష సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. లంచ్ అనంతరం సమావేశం రోజంతా కొనసాగనున్నది.
దళిత ప్రజాప్రతినిధులతో కూడిన అఖిలపక్ష సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ప్రతిపక్ష ఎం.ఐ.ఎం, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి. సిపిఐ, సిపిఐ (ఎం) పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభధ్రంలకు సీఎం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
అదే విధంగా దళిత సమస్యల పట్ల అవగాహన వుండి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను కూడా ఆహ్వనించాలని సీఎం నిర్ణయించారు. సమావేశం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.