బోధన్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 26 నాటికి రైతుల డిల్లీ ముట్టడి పోరాటానికి ఏడు నెలలు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, 1975 జూన్ 26న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంతరంగిక ఎమర్జెన్సీకి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత విధాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే, అట్టి కార్యక్రమానికి వెళుతారని బోధన్ పట్టణంలో పోలీసులు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి మల్లేష్ ను, సీపీఐ నాయకులు ఎస్‌కే బాబును, సీపీఐ (ఎం) పార్టీ నాయకులు జే.శంకర్ గౌడ్‌లను శనివారం ఉదయం అరెస్టు చేశారు.
అరెస్టులను ఖండిస్తూ సీపీఐ (ఎం- ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.మల్లేష్ మాట్లాడుతూ నేడు దేశం లో ప్రభుత్వ విధాలతో నష్ట పోతున్న ప్రజలు, రైతులు, కార్మికులు వ్యతిరేకిస్తే సహించలేక పోతున్నారని, వారికి మద్దతుగా విద్యావంతులను, మేదావులను తుదకు వార్తలు రాసే పత్రిక విలేఖరులను సైతం అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి కట్టుబడి వున్నామంటునే, రాజ్యాంగం దేశ ప్రజానీకానికి ఇచ్చిన ప్రశ్నించే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కులపై దాడి చేయటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల ప్రజాస్వామిక విలువలను కాపాడే విదంగా పని చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పడాల శంకర్, సీ.హెచ్.గంగయ్య, కే.రవి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.