నిజామాబాద్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక సాహితీ వేత్త పాలకుడు అయితే దేశాన్ని అభివ ృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్ళగలడో నిరూపించిన వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయితే పీవీ నరసింహారావు సాహితీ పరిపాలన ధురంధరుడు అని కొనియాడారు.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బహుభాషా కోవిదుడైన పీవీ నరసింహారావు సాహిత్యంపై పట్టు కలిగిన వ్యక్తి అని, ఆయన రాసిన గొల్ల రామవ్వ కథ తెలంగాణ కథకు విశిష్ట స్థానం కల్పించిందని తెలిపారు.
ఆయన శతజయంతిని సంవత్సరకాలం జరపడం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఘనతను తెలంగాణ ఠీవీని ప్రపంచానికి చాటిచెప్పాయని వివరించారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ ఒక పరిపాలన అధ్యక్షుడిగా, సాహిత్య మూర్తిగా సవ్యసాచి గా రాణించిన తెలంగాణ గర్వించదగిన బిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు.
కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి గుత్ప ప్రసాద్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, ఎలగందుల లింబాద్రి, కొమిరిశెట్టి నాగరాజు, కొయ్యాడ శంకర్, తంగళ్ళపల్లి నరేశ్, కె.వి.రమణాచారి, స్వర్ణ సమత , చెన్న శంకర్, మద్దుకూరి సాయిబాబు, రమావత్ కిరణ్, ఏ సురేశ్ , ఆశా నారాయణ , పద్మావతి, రాహుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కవులు కవయిత్రులు కవితా పఠనం చేశారు.