కామారెడ్డి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి జూలై పదవ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులో 100 మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వారితో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లపై మాట్లాడుతూ, వార్డులలోని పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని, రోడ్లపై గుంతలు ఉంటే వాటిని పూడ్చాలని తెలిపారు. జూలై 1న మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహించాలని, వార్డుల వారీగా ఆదాయ, వ్యయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఎస్సీ కాలనీలలో మౌలిక వసతులను గుర్తించాలని పేర్కొన్నారు. విరిగిన, వంగిన విద్యుత్ స్తంభాలు, కిందికి వేలాడే విద్యుత్ తీగలను గుర్తించి విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి వార్డుకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయించాలని, పైప్ లైన్ లీకేజీ లుంటే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
పట్టణంలోని ప్రధాన రోడ్లలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా పెద్ద మొక్కలు నాటించాలని తెలిపారు. వైకుంఠధామాల చుట్టూ పెద్ద మొక్కలు నాటి గ్రీన్ ఫెన్సింగ్ చేపట్టాలని సూచించారు. పట్టణాలకు నాలుగు దిక్కులా డంపింగ్ యార్డులను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మురుగు కాలువలలో పూడికతీత పనులు చేపట్టాలని, రోడ్లపై ఎలాంటి చెత్త లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేయాలని పేర్కొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాని తెలిపారు. ప్రతి ఇంటికి అవసరమైన 6 మొక్కలను అందజేయాలని చెప్పారు. ప్రతి రోజు ఫాగింగ్ చేయాలని సూచించారు. దాతల సహకారంతో పరమపద వాహనం ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్లను కోరారు. మురుగు నీటి గుంతలు ఉంటే ఆయిల్ బాల్స్ విడుదల చేసి దోమలను నివారణ చేయాలని పేర్కొన్నారు. సెల్ కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పాల్గొన్నారు.