కామారెడ్డి, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గత మూడు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామసీమలు పచ్చదనం, పరిశుభ్రతో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు అసెంబ్లీ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
గురువారం మంత్రి బాన్సువాడ మండలం తాడుకోలు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ప్రతినెలా నిధుల మంజూరుతో వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీలు, పల్లె పకృతి వనాలు ఏర్పాటుతో గ్రామ అవసరాలు తీరుతున్నాయని, ఇలాంటివి ఏ రాష్ట్రంలో లేవని, ఇది ముఖ్యమంత్రి కెసిఆర్‌కి మాత్రమే సాధ్యమైందన్నారు.
ప్రతి ఇంటికి ఇచ్చే 6 మొక్కలు పెంచుకోవాలని గ్రామస్తులను కోరుతూ, వారికి ఇష్టమైన మొక్కలు అందించాలని అధికారులకు సూచించారు. తాడుకోల్ గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో అభివృద్ధి చెందాలని, మళ్లీ తాడికోల్ వచ్చి చూస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి పద్మ, తాడుకోల్ గ్రామపంచాయతీ సర్పంచ్ రాజమణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.