బోధన్, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకిస్తూ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ అధికారంలో లేనప్పుడు వారు అధికారం లోకి వస్తే ధరలు పెంచబో మని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా ధరలను పెంచుతూ ప్రజలపై పెను భారం మోపుతున్నారని మండి పడ్డారు. డిసెంబరు నుండి ఇప్పటి వరకు 6 నెలల కాలం లోనే 240 రూపాయలు పెంచారన్నారు.
డిసెంబర్‌లో 100 రూపాయలు, ఫిబ్రవరిలో 75 రూపాయలు, మార్చ్ నెల లో 50 రూపాయలు ఇలా పెంచుతూ పోతున్నారని దుయ్యబట్టారు. పేద ప్రజలకు ఇచ్చే సబ్సీడీని తగ్గిస్తూ పోతున్నారని పేద ప్రజల సంక్షేమమంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే కరోనా సంక్షోభం మూలంగా ఉపాధి కోల్పోయిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా అతలాకుతలం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై పెను భారాన్ని మోపిందని, పెంచిన ధరలను వెంటనే ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఏఐకేఏంఎస్ జిల్లా నాయకులు పడాల శంకర్, ఐఎఫ్‌టీయూ నాయకులు కే రవి, సీ. హెచ్.గంగయ్య, దశరథ్, పోశెట్టి, ఎన్.గంగారాం, గంగాధర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.