కామారెడ్డి, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం ఆయన సదాశివనగర్, భూంపల్లి, పద్మాజివాడి, తిరుమన్‌పల్లి, ఉప్పల్‌వాయి, రామారెడ్డి, గర్గుల్ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. భూంపల్లి, సదాశివనగర్‌లోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు.
సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంలో బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పల్లె ప్రగతి ద్వారా గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం పనులు పక్కాగా చేపట్టాలని కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నాటిన మొక్కలను ఎవరైనా తొలగిస్తే వారికి జరిమానాలు విధించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన భూంపల్లి లైన్‌మెన్ గణేష్‌ను విధుల నుంచి తొలగించాలని ఎస్ .ఈ. శేషారావును ఆదేశించారు. విద్యుత్ సమస్యలు 100 శాతం పరిష్కరించాలని కోరారు. రామారెడ్డిలో మురుగు కాలువల్లో పూడిక తీత పనులు ముమ్మరంగా చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మండల ప్రత్యేక అధికారులు శ్రీకాంత్, శభాన, ఎంపీడీవోలు రాజు వీర్, విజయ్ కుమార్ ఎంపీవోలు లక్పతి నాయక్, సవిత, ఏపీఓలు శృతి, ధర్మారెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, లలిత, కవిత, బాల్ రెడ్డి, గంగారాం, సంజివ్, రవితేజ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.