కామారెడ్డి, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులను పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండ, లింగుపల్లి, అంచనూర్, బీబీపేట మండలం జనగామ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జంగంపల్లిలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మురుగు కాలువలు శుభ్రం చేయాలని, పల్లె ప్రగతి పనులను చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచుల, కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళిత్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన మౌలిక వసతులను గుర్తించి నివేదికలను సమర్పించాలని తెలిపారు. లింగుపల్లిలో ప్రధాన రోడ్డులో మొక్కలు నాటాలని సూచించారు.
పలు ఇళ్లకు వెళ్లి గ్రామపంచాయతీ వారు ఇంటింటికీ మొక్కలు ఇచ్చారా, రోజు చెత్త బండి వస్తోందా, పరిశుభ్రమైన నీరు కుళాయిల ద్వారా వస్తున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణులకు అవసరమైన మొక్కలను అందించాలని పేర్కొన్నారు. నర్సరీని సందర్శించారు. దోమకొండలో కోతుల ఆహార కేంద్రాన్ని సందర్శించారు. జామ, సపోటా మొక్కలు ఏపుగా పెరిగి కాయలు వచ్చాయి. కోతులకు ఆహారం అందే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
జనగామలో కంపోస్టు షెడ్, వైకుంఠధామం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, తక్షణమే వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు. రోడ్డుకిరువైపులా పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ట్రాన్స్‌కో ఎస్. ఈ. శేషారావు, మండల ప్రత్యేక అధికారి జితేంద్ర ప్రసాద్, ఎంపీడీవోలు అనంతరావు, చెన్నారెడ్డి, తహసీల్దార్లు నరసింహులు, మోతిసింగ్, ఎంపివోలు తిరుపతి రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.