కామారెడ్డి, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గ్రామస్తులు శ్రమదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మురుగు కాలువలలో పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి, వాటిని సంరక్షించే విధంగా చూడాలన్నారు. కుటుంబీకులు అడిగిన మొక్కలను అందజేయాలని కోరారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేస్తే పచ్చదనం పెరుగుతుందని చెప్పారు.
ప్రతిరోజు తడి పొడి చెత్తను సేకరించడం ద్వారా కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువు తయారు చేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీడి సాయన్న, ఎంపీడీవో నాగేశ్వరరావు, సర్పంచ్ రత్నాబాయి, కార్యదర్శి మౌనిక, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.