కామారెడ్డి, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద, దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సమీపంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ స్వామి వివేకానంద పూర్వ నామం ‘నరేంద్ర నాథ్ దత్తా’, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యులు, వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకులు అని, స్వామి వివేకానంద హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి అని అన్నారు.
రామకృష్ణ మఠాన్ని స్థాపించి తద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారని, జులై 4, 1902న బేలూరు మఠం, పశ్చిమ బెంగాల్‌లో మరణించారని, వీరి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జన్మదినాన్ని ‘‘జాతీయ యువజన దినోత్సవం’’ ప్రకటించిందన్నారు. ‘‘లేండి, మేల్కొనండి , గమ్యం చేరేదాక ఆగవద్దు.’’ లాంటి ఎన్నో సందేశాలను యువతకు ఇచ్చారని, నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బిక్నూర్ మండల సలహాదారు దుబాసి స్వామి మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య అమరత్వానికి నేటికి 75 సంవత్సరాలు గడిచిందన్నారు.
భూమికోసం, భుక్తి కోసం, బానిస బంధాల నుండి విముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. ఉద్యమానికి ఊపిరి పోసిన కొమురయ్య అమరత్వమని తెలంగాణకు స్వేఛ్ఛ వాయువులు ప్రసాదించిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తిని కలిగించిన వ్యక్తి దొడ్డి కొమురయ్య అని తెలంగాణ ప్రజలు మరువద్దని అన్నారు.
కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు, మోతే లావణ్య, రాజు, రమేష్, నర్సింగరావు, నీలం సాకేత్ తదితరులు పాల్గొన్నారు.