బోధన్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తాలుకా రైస్ మిల్ అసోసీయేషన్ భవన్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమర వీరుడు దొడ్డి కొమురయ్య 75 వర్ధంతిని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి కే.గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలో అత్యంత అరుదైనదని కొనియాడారు.
అప్పటి నల్లగొండ జిల్లా కడివెండి గ్రామంలో ప్రభుత్వ నిర్బంధ లేవి, పన్నులు, వెట్టి చాకిరీలకు వ్యతిరేకంగా ఊరేగింపు తీస్తే, విసునూరు రామచంద్రరెడ్డి గుండాలు కాల్పులు జరిపారన్నారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణించడంతో కమ్యునిస్టు పార్టీ సాయుధ ప్రతిఘటన పోరాటానికి పిలుపు నిచ్చిందని, దానితో తెలంగాణలో రైతాంగ పోరాటం అగ్గిలా మండిరదని, ఎన్నెన్నో చారిత్రక విజయాలను సాధించిందని అసమాన భూసంబంధాలకు, వెట్టి వంటి శ్రమ దోపిడీకి, సామాజిక పీడనకు వ్యతిరేకంగా లక్షలాది ప్రజలు కధిలారన్నారు.
మూడు వేల గ్రామాల్లో భూస్వామ్య పీడన నుంచి విముక్తి పొంది, భూస్వాముల చెరలో వున్న పది లక్షల ఎకరాల భూమి దున్నే వానికే దక్కిందన్నారు. ఈ దేశ ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎంచుకోవలసిన తెలంగాణ రైతాంగ ఉద్యమం చేసి చూపిందన్నారు. సభకు బి.మల్లేష్ అధ్యక్షత వహించగా డివిజన్ కమిటీ నాయకులు గుమ్ముల గంగాధర్, శ్రీను మట్లాడారు. కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు మల్లేష్, ఎల్.గంగాధర్, కే.రవి, గంగయ్య, కృష్ణ, పాషా బేగం, లక్ష్మీభాయి, సావిత్రి, శాంత, గంగామని, తదితరులు పాల్గొన్నారు.