డిచ్‌పల్లి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు, అదేవిధంగా ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలను ఈ నెల 6 నుంచి 9 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్ – షెడ్యూల్ విడుదల చేశారు.
ఈ సంవత్సరం మార్చి నెలలో 23 వ తేదీ నుంచి ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, ఎం.ఎడ్. పరీక్షలను కొవిద్ -19 నిబంధనలను పాటిస్తూ కరోనా సెకండ్ వేవ్ విస్త ృతం అయినందున తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ లాక్ డౌన్ విధిస్తూ అకస్మాత్తుగా 25 వ తేదీ నుంచి వాయిదా వేసిన విషయం విదితమే. కాగా ఈ పరీక్షలను రేపటి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయం పున:ప్రారంభం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా జూలై 6 వ తేదీన జరిగే డిగ్రీ, ఎం.ఎడ్. పరీక్షలు రెండు విడుతలుగా ఉదయం 10:00-12:00 గంటల వరకు, మధ్యాహ్నం 2:00-4:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ పరీక్షలకు మూడవ సెమిస్టర్‌లో 9,695, ఐదవ సెమిస్టర్‌లో 12,586 మొత్తంగా 22,281 మంది విద్యార్థులు హాజరు కానుండగా 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎం.ఎడ్. పరీక్షలకు మూడవ సెమిస్టర్ లో 39 మంది విద్యార్థులు హాజరు కానుండగా ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కంట్రోలర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యం అయిన అభ్యర్థులను ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమని స్పష్టం చేశారు.
కావున డిగ్రీ, ఎం.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించగలరని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సంప్రదించగలరని పేర్కొన్నారు.