గాంధారి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో 920 కోట్లతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా గాంధారి మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రోడ్డు వెడల్పు మరో ఆరు నెలలో నెరవేరుతుందని అన్నారు. విద్యా, వైద్యం, సాగు, తాగు నీరు వంటి అనేక రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు అభివృద్ధి పైనే ద్రుష్టి పెడతారని అన్నారు.
ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అయన అన్నారు. పల్లె ప్రగతిలో పది రోజులపాటు ప్రతి గ్రామంలో ప్రజలు అభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా ప్రణాళిక రూపొందించారని అన్నారు. హరితహారం లో ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణలో చేపడుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలుచేయడం లేదన్నారు.
60 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కెసిఆర్ చేసి చూపెడుతున్నారని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం ఉండికూడా లేన్నట్లే ఉందని అన్నారు. ఏది చేసినా వారికి మింగుడు పడటం లేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమి చేసిందని ప్రశ్నించారు. అభివృద్ధికి కాలు అడ్డు వేయడమే ప్రతిపక్షం ఎంచుకున్న నినాదం అని అన్నారు.
గాంధారి మండలంలో త్వరలో డబుల్ బెడ్ రూమలు ప్రారంభిస్తామని అన్నారు. అర్హులైన వారికి మరిన్ని డబుల్ బెడ్ రూములు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.