గాంధారి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలోని సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకొనివెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. అంతేకాకుండా బీజేపీ నాయకులను అరెస్టు చేసి ప్రారంభోత్సవాలు చేయడం అంతకంటే సిగ్గుచేటని అన్నారు.
సోమవారం గాంధారి మండల కేంద్రంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి పర్యటన సందర్బంగా మండలంలో నెలకొన్న సమస్యలు తెలుపడానికి వినతి పత్రంతో వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి పర్యటన ముగిసిన అనంతరం వారిని విడిచిపెట్టారు.
అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ మండలంలో చాలా సమస్యలుకుప్పలు కుప్పలుగా ఉన్నాయని, స్థానిక బస్టాండ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. గుడిమెట్ నుండి కారక్వాడికి సరైన రోడ్డు మార్గం లేదన్నారు. మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలు అలాగే ఉన్నాయన్నారు.
మండలంలోని పలు గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలు ప్రారంభం కాకముందే బీటలువాలుతున్నాయని, సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకు కానరావడం లేదా అని ప్రశ్నించారు. సమస్యలు మంత్రికి తెలుపుదామని వెళ్తున్న తమని అరెస్ట్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ నాయకులు సాయిబాబా, జివ్వాడి శ్రీకాంత్, మధుసూదన్, రవి, కిష్టయ్య, గంగారాం, సాయాగౌడ్, పుండరీకం, గంగి రమేష్, సతీష్, నవీన్, గోపాల్ తదితరులు ఉన్నారు.