కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి ద్వారా గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. నిజాంసాగర్ మండలం బంజపల్లి, పిట్లం మండలం చిన్న కొడప్గల్, పెద్ద కొడప్గల్, జుక్కల్ మండలం కేమ్ రాజ్ కళ్ళాలి, బిచ్కుంద, మద్దునూరు మండలం సుల్తాన్ పేట గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. బిచ్కుందలో పల్లె ప్రకృతి వనం సందర్శించారు.
పల్లె ప్రకృతి వనంలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి రమేష్ ఇంక్రిమెంట్‌లో కోత విధించాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో రోడ్డుకిరువైపులా రెండు వరుసల్లో పెద్ద మొక్కలు నాటాలని కోరారు. తడి, పొడి చెత్తను చెత్త బండి ద్వారా కంపోస్ట్ షెడ్డుకు తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.
మొక్కలు పెంచడం వల్ల భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని, మొక్కలను అధికంగా పెంచితే సమృద్ధిగా వర్షాలు కురిసే వీలు ఉంటుందని తెలిపారు. వైకుంఠధామం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.