కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై రెండు మున్సిపాలిటీలు,10 గ్రామాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సుడిగాలి పర్యటన చేశారు. పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామంలో సుందరంగా తీర్చిదిద్దబడిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మున్సిపాలిటీ 33 వార్డులో, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు.
లింగంపేట మండల కేంద్రంలో, ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్, నిజాంసాగర్ మండలం బంజపల్లి, పిట్లం మండలం చిన్న కొడప్గల్, పెద్ద కొడప్గల్, జుక్కల్ మండలం కేమరాజ్ కళ్ళాలి, సుల్తాన్ పేట, బిచ్కుంద, బీర్కూర్, తిమ్మాపూర్, నస్రుల్లాబాద్ గ్రామాలలో పచ్చదనం, పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదని, గతంలో నాటిన మొక్కలు ఏమైనా చనిపోయినట్లు అయితే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కల సంరక్షణ గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలు బాధ్యతతో నిర్వహించాలని, ట్యాంకర్లతో నీటి వసతి కల్పించాలని, ట్రీగార్డులు, పాదుల ఏర్పాటుతో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
పల్లె ప్రగతి కార్యక్రమాల పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులలో పెద్ద మొక్కలతో హరిత కంచెలను ఏర్పాటు చేయాలని తెలిపారు. 2019 నూతన పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గ్రామసీమల అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని, దీనికి ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు.
ఈ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ బడ్జెట్‌లో పది శాతం గ్రీన్ బడ్జెట్ కింద తప్పనిసరిగా ఖర్చు చేయాలని ఆదేశించారు. గ్రామాల అవసరాలు, అభివృద్ధికి ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను ప్రభుత్వం సమకూర్చినదని, వాటి లక్ష్యాలను నెరవేర్చాలని, తప్పనిసరిగా నిర్ణీత సమయంలో వాటరింగ్ చేపట్టాలని, అలాగే ఇంటింటా తడి చెత్త పొడి చెత్త సేకరణతో కంపోస్ట్ షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీతో గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశ భవిష్యత్తు అన్నారు. కార్యక్రమాలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ ధోత్రే, అధికారులు, గ్రామ సర్పంచులు, సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.