కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతితో సంపూర్ణంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. విద్యానగర్‌లోని పార్క్‌ను సందర్శించారు. పార్క్ లో మరిన్ని పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
2019 మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నదని, దీనిలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద పచ్చదనం పెంపొందించడానికి ఖచ్చితంగా ఖర్చు చేయడం జరుగుతున్నదని, ప్రతినెలా సిసి ఛార్జీల చెల్లింపులు రెగ్యులర్‌గా జరుగుతున్నాయని, మిగతా నిధులలో గుర్తించిన పనులు చేపట్టడం జరుగుతున్నదని, ఇదంతా ఖచ్చితమైన ప్రణాళికతో పట్టణాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇళ్లలో ప్రభుత్వం అందజేసే ఆరు మొక్కలు తప్పనిసరిగా నాటుకొని వాటిని సంరక్షించాలని, ఇంటి ముందు మొక్కలు కాపాడే బాధ్యత ఆ ఇంటి వారే చూడాలని కోరారు. మానవ మనుగడకు మూలాధారం చెట్టు అని అలాంటి చెట్లను మనం సంరక్షించుకోవాలని అన్నారు.
ఇంటి ముందు మురికి కాలువలలో చెత్త వేయవద్దని, చెత్త పేరుకొని తిరిగి మురికి కాలువలు అపరిశుభ్రంగా మారుతాయని అన్నారు. పారిశుద్ధ్యం మనందరి బాధ్యత అని, మున్సిపాలిటీ వాహనాలు వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు డబ్బాలలో వేయడం బాధ్యతగా భావించాలని అన్నారు. కార్యక్రమంలోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, కమిషనర్ దేవేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.