డిచ్పల్లి, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి, నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు ఈ నెల 26 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
కాగా అందుకు సంబంధించిన పరీక్షాకేంద్రాల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్లో లింక్ విడుదల చేశారు.
లింక్ ద్వారా పీజీ విద్యార్థులు ఈ నెల 13 వ తేదీ వరకు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవలసిందిగా కోరారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని, లేకుంటే హాల్ టికెట్ జనరేట్ కాదని, దాని ద్వారా విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్పల్లి క్యాంపస్లో, తెలంగాణ విశ్వవిద్యాలయం, బిక్నూర్ సౌత్ క్యాంపస్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
పరీక్షల షెడ్యూల్ ఒకదాని వెంట ఒకటి నిర్వహించడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురి గాకుండా రెండు సెమిస్టర్స్ పరీక్షలు ఒకే హాల్ టికెట్ మీద, ఒకే పరీక్షా కేంద్రంలో రాసే వెసలుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలలో 8, ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలో 6 మొత్తంగా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకొనే వెసలుబాటు కల్పిస్తున్నట్లు సివోఇ తెలిపారు.
పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని పేర్కొన్నారు.
కావున పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియ కోసం http://tuadmissions.org/pgcent/ucent2021d/index.php వెబ్ సైట్ను సంప్రదించవచ్చన్నారు.