నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లోని నాగారం గుట్టల మధ్య ఉన్న నీరుగొండ హనుమాన్ దేవాలయంలో అష్టోత్తర శత కలశ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం శనివారం ఉదయం ప్రారంభమైంది.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, సతీమణి సౌభాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. వీసీని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గోపూజ, ధ్వజారోహణం, గణపతి పూజ, కలశ పూజ, దేవనాందీ, పంచగవ్య, యాగశాల ప్రవేశం, నవగ్రహ పూజ, పాల మడుగు దర్శనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నీరుగొండ హనుమాన్ జెండా ఆవిష్కరణ, కలశ ప్రతిష్టాపన గావించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వంద సంవత్సరాలకు పై బడిన చరిత్ర కలిగిన నీరుగొండ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయ అభివృద్దికి పాటు పడుతున్న ఆలయ కమిటీ సభ్యులను విసీ ప్రశంసించారు. పచ్చని ప్రకృతి, స్వచ్చమైన వాతావణంలో ఉన్న ఈ ఆలయం హనుమాన్ భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తుందన్నారు.
హనుమాన్ ఆశీర్వాదంతో కరోనా విపత్కర పరిస్థితి తొలగి పోవాలని, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలని కోరారు. తనకు సామాజిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడమంటే ఆసక్తి ఎక్కువన్నారు. ఇకముందు కూడా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. తనకు ఆశీర్వచనాలు ఇచ్చి, తెలంగాణ విశ్వవిద్యాలయం వ ృద్ధిపథంలో నడవాలని ఆకాంక్షించిన ఘనాపాటి పూజారులకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భీమనాతి భూమయ్య, పెద్ది సాయిబాబ, బద్ధం గంగాకిషన్, సుధాకర్, దయావర్ కిషన్, మాంకాలి విజయ్, టీయూ పిఆర్‌వో డా. వి. త్రివేణి, ఎసి డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.