డిచ్పల్లి, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు ఈ నెల 22 తేదీ నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు.
పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని పేర్కొన్నారు.
అలాగే డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 15 నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సంప్రదించగలరని తెలిపారు.