డిచ్‌పల్లి, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగపు పరిశోధక విద్యార్థులు పిట్ల సరిత, బాడె శ్రీకాంత్‌లకు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. అసోషియేట్ ప్రొఫెసర్ డా. ఘంటా చంద్రశేఖర్ పర్యవేక్షణలో పరిశోధకురాలు పిట్ల సరిత ‘‘మహిళల మీద టీవీ సీరియల్స్ ప్రభావం – నిజామాబాద్ జిల్లా పరిధి – ఒక అధ్యయనం’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కుల్ గ్రామానికి చెందిన అమరుడు ఉద్యమ నాయకుడు పిట్ల ఎల్లన్న చిన్న కుమార్తె సరిత. చిన్ననాటి నుండి పేదరికం, ఆర్థిక సమస్యలతో చిన్నాభిన్నమైన తన చదువును ఏ మాత్రం ఆపకుండా ఒకటవ తరగతి నుండి పిహెచ్. డి. వరకు ప్రభుత్వ విద్యా సంస్థలలోనే చదివారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో పాల్గొని ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సౌత్ క్యాంపస్‌లో గల ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
తాను ఉద్యమించి సాధించుకున్న విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అవార్డు పొందడం ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వైవాకు చైర్మన్‌గా వ్యవహరించిన సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కె. శివశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో టీవీ సీరియల్స్ తీరును ఏవిధంగా అర్థం చేసుకోవచ్చునో, వాటి వల్ల లాభ నష్టాలను అధ్యయనం చేయడానికి ఈ సిద్ధాంత గ్రంథం సరిjైున డాటా సమాచారం పొందుపరిచి, తదనంతర పరిశోధకులకు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిక్నూర్ సౌత్ క్యాంపస్‌లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తూ పిట్ల సరిత పిహెచ్.డి. అవార్డ్ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం హర్షం వ్యక్తం చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వై. ప్రభంజన్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధకుడు బాడే శ్రీకాంత్ ‘‘రాజకీయ సాధికారత పై కమ్యూనికేషన్ పద్ధతులు – బహుజన్ సమాజ్ వాది పార్టీ – ఉత్తర్ ప్రదేశ్’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
అందుకు గాను వర్చువల్ (ఆన్ లైన్) వేదికగా ఓపెన్ వైవా (బహిరంగ మౌఖిక పరీక్ష) నిర్వహించగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుంచి సీనియర్ ఆచార్యులు డా. సుధీర్ కుమార్ ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌గా హాజరై ఇద్దరు పరిశోధకులను సిద్ధాంత గ్రంథాలపై వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాల్లో నిర్దిష్ట పరిశోధనల అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసి పరిశోధక విద్యార్థి పిట్ల సరిత, బాడె శ్రీకాంత్ ను వీసీ, రిజిస్టార్స్ అభినందించారు. ఇక ముందు కూడా ప్రామాణిక పరిశోధనలు చేయాలని, అందుకు గాను లాబొరేటరీలను వృద్ధిపరుస్తానని, ప్రత్యేకంగా సోషల్ సైన్స్ సబ్జెక్టుల్లో ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేస్తూ సరిjైున డాటా పొందుపరిచాలనన్నారు.
కార్యక్రమంలో సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కె. శివశంకర్, మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా. హరిత, పిఆర్‌ఓ డా. వి. త్రివేణి, మాస్ కమ్యూనికేషన్ విభాగ అధ్యక్షులు డా. ఘంటా చంద్ర శేఖర్, బిఓఎస్ డా. ప్రభంజన్ కుమార్, డా. రాజారాం, డా. శాంతాబాయి, డా. మోహన్ తదితర అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.