వేల్పూర్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వలన ఏర్పడిన కల్లోల పరిస్థితుల వలన గత ఏడాది కాలంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి తాము పోరాటం చేస్తున్నామని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ వేల్పూర్ మండల వలంటీర్ భైరి రాకేష్ అన్నారు. వేల్పూర్ గ్రామ పంచాయతి వద్ద సోమవారం నిర్వహించిన గల్ఫ్ కార్మికుల అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
‘జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్’ (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే నినాదంతో కొన్ని అంతర్జాతీయ సంస్థలు చేపట్టిన ఉద్యమంలో భాగంగా తాము వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి హక్కుల గురించి అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యూనియన్ నాయకుడు రాకేష్ అన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేష్, వార్డు సభ్యులు, యూనియన్ ప్రతినిధులు రామకృష్ణ, సాయి కిరణ్, పార్థ సారధి, శశి కిరణ్, ప్రశాంత్, సాగర్, ధనుంజయ్, గల్ఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
జీతం బకాయిలు రాబట్టుకోవడానికి బాధితులు తమ వివరాలను ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ 91 86883 98584 కు పంపించాలని ఆయన కోరారు. విదేశాలలోని భారతీయ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థల సహకారంతో విదేశీ లేబర్ కోర్టులలో న్యాయ పోరాటానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.