నందిపేట్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం టిఆర్‌ఎస్ ద్వారానే సాధ్యమని, కొత్త బిచ్చ గాళ్ల ఆటలు సాగవని ఆర్మూర్ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళుతున్నారని కితాబిచ్చారు. అటువంటి ముఖ్య మంత్రిని గాని, మంత్రి కెటిఆర్‌ను గాని రేవంత్ రెడ్డి, షర్మిలలు విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. పిసిసి అధ్యక్షునిగా హోదా పెరిగితే హుందాతనం పెంచుకొని మాట్లాడాలని హితువు పలికారు.
గ్రామాలలో తిరిగి అభివృద్ధి పనులు చూడాలని కోరారు. ప్రతి చోట హరితహారం, ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, స్మశానవాటికలు, డ్రైనేజీల నిర్మాణాలు చేస్తు దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ ఉందని తెలిపారు. 100 పైగా ఎంఎల్‌ఏ లు, 33 జడ్‌పి చైర్మన్‌లు, 12 వేల సర్పంచులతో ఉన్న టిఆర్‌ఎస్ సైన్య ప్రభంజనానికి షర్మిల, రేవంత్ రెడ్డి కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో ఎంపిపి వాకిడి సంతోష్, వైస్ ఎంపిపి దేవేందర్, సిద్దాపూర్ సర్పంచ్ తొంటి లక్ష్మీ నర్సయ్య, కో అప్సన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పిఏసిఎస్ చైర్మన్‌లు, ఎమ్మార్వో, ఎండిఓ, ఎస్‌ఐ తదితర అధికారులు, నాయకులు ఎర్రం ముత్యం, ఉల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.