కామారెడ్డి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోని రైతు వేదికలలో రైతు శిక్షణ శిబిరాలు వారంలో రెండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతు సదస్సులకు 100 మంది రైతులకు తగ్గకుండా చూడాలన్నారు. విస్తీర్ణ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పంటలను నమోదు చేసుకోవాలని సూచించారు.
రైతులు సాగు చేసిన పంటల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. లక్ష్యానికి అనుగుణంగా రైతులకు పంట రుణాలు అందించాలని కోరారు. ఆన్లైన్లో పంటల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎరువుల పంపిణీ సమయంలో ఏఈఓలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, ఎడిఎలు శశిధర్, రత్నమాల, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.