హైదరాబాద్, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాగల 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ నగరంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు ఉంటాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో కూడిన గాలులు వీస్తాయని తెలిపింది.
ఇదిలా ఉంటే, నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉన్న ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరం దగ్గర స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్ళే కొలదీ నైరుతి వైపునకు వంపు తిరిగి స్థిరముగా ద్రోణి కొనసాగుతున్నట్టు చెప్పింది. తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు లాట్ 18 ఎన్ లాటిట్యూడ్ వెంబడి సముద్ర మట్టానికి 3.1 కి మీ నుంచి 5.8 కిమీ. మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉందని ప్రకటనలో తెలిపింది.
కుచ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గడ్, ఉత్తర కోస్తా ఆంధ్రా మీదుగా అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి వ్యాపించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.