కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాథ బాలలు, తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించడంలో చైల్డ్ కేర్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని మూడు డివిజన్లలో చైల్డ్ కేర్ బృందాలు ఇటుక బట్టీలు, హోటల్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్, మార్కెట్స్, రైస్ మిల్లులు, షాపులు, నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రాంతాలలో సంబంధిత పోలీసు రెవెన్యూ అధికారుల తోడ్పాటుతో విస్తృత తనిఖీలు నిర్వహించాలని, 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, బాలకార్మిక, యాచక వృత్తి, బడి మానేసిన బాలబాలికలను గుర్తించి వారికి రక్షణ కల్పించాలని, వసతి విద్య సౌకర్యాలు కల్పించాలని, ఇందుకోసం స్వచ్చంద సంస్థల తోడ్పాటు కూడా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వై.అనురాధ, సిడిపివోలు పాల్గొన్నారు.