డిచ్పల్లి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.
మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు డిగ్రీ ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 178 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 165 మంది హాజరు, 13 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. ఏ పరీక్షా కేంద్రంలో కూడా డిబార్ కేసులు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ సెలబస్కు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు ఈ నెల 22 తేదీ నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి విద్యార్థుల సౌలభ్యం కోసం 47 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలను ఈ నెల 19 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ పేర్కొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు ఈ నెల 26 నుంచి 31వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ అన్నారు.
పీజీ పరీక్షల పరీక్షాకేంద్రాల ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 13 వ తేదీ వరకు కొనసాగించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవలసిందిగా ముందే సూచించామన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్ పల్లి క్యాంపస్ లో తెలంగాణ విశ్వవిద్యాలయం, బిక్నూర్ సౌత్ క్యాంపస్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
పరీక్షల షెడ్యూల్ ఒకదాని వెంట ఒకటి నిర్వహించడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురి గాకుండా ఈ రెండు సెమిస్టర్స్ పరీక్షలు ఒకే హాల్ టికెట్ మీద, ఒకే పరీక్షా కేంద్రంలో రాసే వెసలుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలలో 8, ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలో 6 మొత్తంగా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకొనే వెసలుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని పేర్కొన్నారు.
కావున డిగ్రీ, పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు.