వేల్పూర్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధిక ధరలు, పెట్రోలు పెంపుపై చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ముందస్తుగా వేల్పూర్ మండలంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట్ అన్వేష్ రెడ్డిని, వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నర్సిరెడ్డిని పలువురు కాంగ్రెస్ నాయకులను తెల్లవారుజామున వేల్పూర్ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొనకుండా తెల్లవారుజామున 4 గంటలకు అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతిస్తూనే అరెస్టు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ పెరిగిన ధరలకు నిరసనగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచుతూ పోతుంటే దానిపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా పోయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అక్రమ అరెస్టులు చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. 40 రూపాయల ధర ఉన్న పెట్రోల్, డీజిల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి 70 శాతం పన్నులు వేయడం వల్ల పెట్రోల్ ధర వంద రూపాయల వరకు పెరిగిందని అన్నారు.
పరోక్షంగా నిత్యవసర వస్తువుల ధరలపై భారం పడి సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువులు అందుబాటులో లేకుండా ఉండడమే కాకుండా పెట్రోల్ డీజిల్ ఆధారిత వస్తువులపై ఆధారపడిన రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే వరకూ కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల తరపున నిత్యము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీరడి భాగ్య, దామోదర్ గౌడ్, వేల్పూర్ టౌన్ ప్రెసిడెంట్ నరేందర్, రాజేందర్, రమణ, గంగయ్య, అరవింద్, జంగన్న పాల్గొన్నారు.