కామారెడ్డి, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గ్రామానికి ప్రకటించిన రూ.10 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పెండిరగ్ పనులపై సర్పంచులు, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ నిధులతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామం పనులు ఈనెల 31 లోగా పూర్తి చేయాలని సర్పంచులను కోరారు. పూర్తి చేయని సర్పంచులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి గ్రామంలో రోజువారీగా తడి, పొడి చెత్తను సేకరించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న కంపోస్టు షెడ్లు పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలు 85 శాతం జీవించకపోతే సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అసంపూర్తి పనులు ఉన్న గ్రామాలో వెంటనే పూర్తిచేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, జిల్లా పంచాయతీ అధికారిణి సునంద, డిఎల్‌పివోలు సాయిబాబా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.