నిజామాబాద్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చలో రాజ్ భవన్ కార్యక్రమానికి వెళ్లిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ పెరిగిన డీజిల్ పెట్రోల్ పన్నులకు నిరసనగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే రేవంత్ రెడ్డితో పాటు, నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని వేణురాజ్ అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రోల్ డీజిల్, నిత్యవసర వస్తువులపై ఉన్న పన్నులను తగ్గించాలని, చేతగాని ప్రభుత్వాల వల్ల దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని, కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన సామాన్య మధ్యతరగతి కుటుంబాల పైన ఇలా అధిక ధరలు మోపుతూ కేంద్రం, రాష్ట్రంలో ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన విమర్శించారు.
వీటిపైన ఆందోళన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే పోలీసులతో రేవంత్ రెడ్డిని, నాయకులను అరెస్టు చేయడం దారుణమని, ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తే వారిని పోలీసులతో అరెస్టు చేసి మా యొక్క ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని, పెరిగిన పెట్రోల్ డీజిల్, నిత్యవసర వస్తువులపై పన్నులను తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వేద మిత్ర, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా నాయకులు సాయి, వర్ధన్, చింటూ తదితరులు పాల్గొన్నారు.