కామారెడ్డి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి కోర్టు ద్వితీయశ్రేణి న్యాయమూర్తి బాల్ రెడ్డికి వారి నివాసంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి బాల్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదు అన్న సూత్రము న్యాయ వ్యవస్థకు పునాది అని అన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించాలని అన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు అని అన్నారు. ఆత్మీయుల మధ్య ఆస్తి పంపకాలకు ఆశ్రయించేది న్యాయ స్థానం అని అవినీతి పరులకు శిక్ష విధించేధి న్యాయస్థానం అని అన్నారు.
రాజీ మార్గమే రాజా మార్గమని ప్రతి ఒక్కరు క్షణికావేశాన్ని పక్కనబెట్టి లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకొని సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తులకు, న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా పారా లీగల్ వాలంటరీగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయిలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, సమాచార హక్కు చట్టం 2005 పై ప్రజలకు అధికారులకు స్వచ్చందంగా అవగాహన కల్పిస్తు సేవా కార్యక్రమాలు చేస్తున్న అంకం శ్యామ్ రావును వారి బృందాన్ని అభినందించారు.
కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు అంకం శ్యామ్ రావు, ఎం వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.