కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అటవీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జరిగిన జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల ఆక్రమణ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు.
అటవీ రక్షణలో భాగంగా అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా, అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లాలో 18 రూట్లలో స్పెషల్ స్క్వాడ్ టీముల ఏర్పాటుతో నిఘా చేపట్టాలని తెలిపారు. సా మిల్లులలో సిసి కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని, టింబర్ డిపో యజమానులకు అటవీ చట్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
గ్రామాలలో కరపత్రాలు, టాంటాంల ద్వారా అటవీ భూములు, అటవీ సంపద జోలికి వెళ్ళకూడదు అనే విషయాలు స్పష్టంగా తెలిసేలా అవగాహన ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అటవీ అధికారులు రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో జాయింట్ సర్వే చేసి అటవీ భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని, డివిజన్ స్థాయిలో తరచూ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు.
ప్రతి మండలంలో ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో భాగంగా నస్రుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాలలో పది ఎకరాల స్థలం చొప్పున ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, జిల్లా అటవీ అధికారి నిఖిత, ఆర్డీవోలు రాజాగౌడ్, ఎస్.శీను, జిల్లా షెడ్యూల్ తెగల సంక్షేమ అధికారి అంబాజీ, ఫారెస్ట్ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.