నిజామాబాద్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్ గడ్డ మరింత చైతన్యం పొందిందనీ, ప్రతి ఉద్యమంలో తన సత్తాచాటి తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. గురువారం దాశరథి జయంతి సందర్భంగా కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దాశరథి కవులకు రచయితలకు కాదు ప్రజావాహిని మొత్తానికి చైతన్య స్ఫూర్తి ప్రదాత అని ఆయన కీర్తించారు. నిజామాబాద్ ఖిల్లా జైలు వేదికగా ఆయన కురిపించిన అగ్నిధార యావత్ తెలంగాణ ఉద్యమాలకు దిక్సూచి నిలిచిందని ఆయన అన్నారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ చిక్కటి కవిత్వానికి అద్భుతమైన పద్యానికి దాశరథి చిరునామా అని కొనియాడారు.
తెరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రముఖ కవి గోశిక నరసింహ స్వామి మాట్లాడుతూ దాశరధి భావజాలం బానిసత్వం ఛేదనకు వజ్రాయుధంగా నిలబడిరదన్నారు. కార్యక్రమంలో తిరుమల శ్రీనివాస్ ఆర్య, తంగళ్ళపల్లి నరేశ్, గోశిక రవి, మద్దుకూరి సాయిబాబు, తొగర్ల సురేశ్, మల్లవరపు చిన్నయ్య, కిరణ్ రామావత్, నవలా రచయిత పోత్నూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కవులు, రచయితలు దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.