నిజామాబాద్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయిన రోజునే అతనికి రావలసిన పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ ఏకకాలంలో అతని చేతిలో పెట్టి గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయాలకు, ఆయన రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన భరోసా భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, చనిపోయిన పెన్షన్నర్ కుటుంబీకులకు ఇవ్వవలసిన మట్టి ఖర్చులు చెల్లించేందుకు కూడా (అంతిక్రియలు కోసం) మూడు నెలలకు పైగా పడుతోందని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే.రామ్మోహన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
రిటైర్ అయిన వారి గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, కామ్మిటేషన్, ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు తదితర ప్రయోజనాలన్నీ మూడు నెలల నుండి ఆరు నెలల వరకు చెల్లింపులు జరగటం లేదని అన్నారు. మొదటి తారీకున తీసుకునే పెన్షన్ పదో తారీకు వరకు రావటం లేదని గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, దీని మూలంగా రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని, పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సమావేశంలో ఇంకా జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి మురళి, మేరీ, బేబీ, కార్యదర్శి ఎం.జార్జి పాల్గొన్నారు.