భీమ్గల్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి పరిశీలించారు.
శుక్రవారంనాడు ఆయన మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్‌లలోని చెరువులు, చెక్ డ్యాములు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు నిండి అలుగు పారడం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోతే గ్రామంలో సాగునీటికి సాగు భూములకు నీటి సమస్య ఉండేదని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మాటు కాలువకు రూ. 3 కోట్ల 80 లక్షలు మంజూరు చేసి పనులు పూర్తి చేయించామని తద్వారా గత సంవత్సరం కొంత ఫలితం వచ్చిందని ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి జూలై నెలలోనే చెరువు నిండడం అలుగు పారడం సంతోషదాయకం అన్నారు.
మూడు నాలుగు రోజుల్లో నుండి కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు పై నుంచి వరద నీరు వస్తుందని, నిన్న మూడున్నర నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నదని, కిందకి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలామని ప్రస్తుతం ప్రాజెక్టులో 85 టీఎంసీలు బ్యాలెన్స్ చేస్తూ కిందకి రెండు లక్షల వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్నవారు ఒకటి రెండు రోజులు బయటకి రాకుండా ఉండాలని వాతావరణ సూచనని తెలిపారు. విద్యుత్తు, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యుత్తు అంతరాయం కాకుండా చూస్తున్నారని తెలిపారు.
ముచ్కూర్‌లో చెరువు తెగిపోవడం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కట్ట రిస్టోరేషన్‌కు ఆదేశాలు జారీచేశారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్, బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని నీలపల్లి చెరువు విపరీతమైన వర్షాలు పడి చెరువు కట్ట తెగి పోవడం జరిగిందని రిస్టోరేషన్కు రూ. 93 లక్షల రూపాయలతో మంజూరు చేసుకొని పనులు జరుగుతుండగా కట్ట తెగి పోవడం జరిగిందని చెరువు కట్ట కింద ఉన్న రైతులకు 150 ఎకరాలలో పంట నీట మునిగి ఇసుక, మట్టి చేరి నష్టం జరిగిందని తెలిపారు.
రైతులకు తొందరలోనే కట్టమీదకి పోవడానికి రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేయాలని తహసిల్దారు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.