నిజామాబాద్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా కనీసం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని, తాజా రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియకపోవడం టిఆర్‌ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు.
శనివారం కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల అన్నింటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత కోచింగ్, స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ లోని వివిధ శాఖల్లో, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మొదలైన డిమాండ్లతో పిడిఎస్‌యు, పివైఎల్ ఆధ్వర్యంలో ఈనెల 26 న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు.
అందులో భాగంగా 26న నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థి, నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు ప్రత్యూష, అశుర్, ప్రణయ్, సాయితేజ, రమేష్, విజయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.