నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదు రకాల దీర్ఘ వ్యాధులకు సంబంధించి జిల్లాలో ఆగస్టు 2 నుండి హెల్త్ వీక్ సర్వే నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 2 నుండి ఇంటింటికీ తిరిగి ఆరోగ్యశాఖ సిబ్బంది కుటుంబాలలోని ప్రజల ఆరోగ్య సమస్యలకు సంబంధించి వివరాలు సేకరించుటకు హెల్త్ వీక్ సర్వే నిర్వహించాలని, కోవిడ్-19 తో పాటు క్యాన్సర్, టీబి, హెచ్‌ఐవి, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి పూర్తి వివరాలను సేకరించడంతో పాటు వాటిని కొత్తగా సిద్ధం చేసిన యాప్‌లో నమోదు చేయాలని తద్వారా ఆయా పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్ళినప్పుడు వారి ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరిశీలించి తదుపరి చికిత్సలు అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
అంతేకాక కరోనా మహమ్మారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించడానికి తద్వారా వారికి భరోసా కల్పించినట్లు అవుతుందని అన్నారు. హరితహారంలో ఇంకా లక్ష్యాలు పూర్తి కానందున దానిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా కృషి చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమర్పించిన వీడియో క్లిప్పింగులను ఆయన పరిశీలించారు.
ప్రతి శాఖ వారు సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్ ద్వారా పరిశీలించారు. జిల్లా గ్రీనరీ శాతం పెరగాలంటే డిపిఓ, డిఆర్‌డిఓ శాఖల పై పెద్ద బాధ్యత ఉన్నదని, డిఆర్డిఓ నుండి ప్రతి రోజు జి పి వారిగా రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. కావున ప్రతి రోజు 2 – 3 లక్షలు నాటితేనే లక్ష్యం పూర్తి అవుతుందని ఇందుకు ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా ప్రతి రోజు పనులు ఇవ్వాలని అధికాలను అదేశించారు.
కొన్ని శాఖల ప్రోగ్రెస్ చాలా పూర్‌గా ఉన్నదని వారు వెంటనే మొక్కల టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతి రాజ్, రోడ్లు భవనాల శాఖల వారు ఏ ఒక్క రోడ్డు ఖాళీ స్థలం వదులవద్దని, లోకల్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని మొక్కలు నాటాలని సంబంధిత అధికాలను ఆదేశించారు. కొన్ని శాఖలు ఇచ్చిన టార్గెట్ బాగా పూర్తి చేశారని, జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా ఎంపిడిఓ కార్యాలయాలలోను, యస్‌సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో హాస్టల్స్‌లో నాటిన మొక్కల వీడియో క్లిప్పింగ్స్ పరిశీలించి సంత ృప్తి చెంది ఇందల్వాయి, మోర్తాడ్ మండలాల అధికారులను, జిల్లా అధికారులను అభినందించారు.
కోవిడ్ సందర్భంగా పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నందున క్లోజ్‌గా మానిటర్ చేయాలని, హాజరు శాతం పెంచాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు చెడిపోయిన దగ్గర మరో మొక్కను పెట్టాలి కానీ మొక్కలు లేకుండా ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఫారెస్ట్ అధికారి సునీల్, ట్రెయినీ ఐఏఎస్ మకరంద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.