నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఏమిటి వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం (పీ.వై.ఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్, వి.సత్యం, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, గౌతమ్ మాట్లాడుతూ కెసిఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా కనీసం 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తాజా రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియకపోవడం టిఆర్‌ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.
విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యోగాల కోసం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల జిమ్మిక్కు మాటలు మాని తక్షణమే, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని, వెంటనే నిరుద్యోగ భృతి అమలుకు పూనుకోవాలని, ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత కోచింగ్, స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం లోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ భృతి అమలుకు పూనుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా కార్యదర్శి పోశెట్టి, జిల్లా నాయకులు సాయరెడ్డి, భాస్కర్, కళ్యాణ్, మారుతి, వెంకటేష్, సాయినాథ్, మనోజ్, విఠల్, తారాచంద్, రాజు, విజయ్, పీ.డీ.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, ప్రశాంత్, ప్రత్యూష, ప్రేమ్ చంద్, సాయితేజ, గంగారాం, నరేష్, దాసు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.