మోర్తాడ్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మోర్తాడ్ మండల దళిత సంక్షేమ సంఘ సభ్యులు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఏడవ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లూరి రాజా రామ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం మన దేశానికి ఎంతో మేలు చేశారని, కలాం దేశానికి సూర్యకిరణంలా వెలుగును పంచారని, అట్టడుగు స్థాయిలో జన్మించి సైంటిస్ట్‌గా తయారై ఆదర్శంగా నిలిచారన్నారు.
దేశంలో ఎన్నో రాకెట్ ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించి దేశాన్ని ప్రపంచ దేశాలతో సమానంగా ముందుకు తీసుకెళ్లడానికి కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. నేటి యువత, విద్యార్థులు కలాం స్ఫూర్తిగా దేశానికి రక్షణ కవచంలా ఉంటు దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు.
కలాం తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించాలని పరితపించిన వ్యక్తి అని, కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని సందేశాన్నిచ్చిన శాస్త్రవేత్త అని అన్నారు. కార్యక్రమంలో జాంబవ మాదిగ, మామిడి గంగాధర్, రవి, మామిడి రాజేశ్వర్, మల్లూరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.