నిజామాబాద్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాల వారికి సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థిక అభివ ృద్ధికి సహకరించాలని ఈ దిశగా డీఆర్డీఏ అధికారులు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు.
బుధవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా డిఆర్‌డిఎ జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో పాటు బ్యాంకర్లతో మహిళా సంఘాలకు రుణాల మంజూరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఆవరేజ్ 18 శాతం ఉండగా జిల్లాలో కొన్ని మండలాలు అంతకంటే తక్కువ మరి కొన్ని మండలాలు మంచి స్థాయిలో పనిచేస్తున్నాయని రాష్ట్రంలో జిల్లా ర్యాంకు 17వ స్థానంలో ఉండటం దురదృష్టకరమని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరో వారం రోజుల్లో జిల్లా స్థాయిలో మంచి ప్రోగ్రెస్ కనిపించే విధంగా ఏపీఎంలు, ఏపీఓలు, డిఆర్‌డిఏ అధికారులు కృషి చేయాలని లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. అధికారులు బ్యాంకులకు వెళ్లి అర్హత గల సంఘాలకు నిర్ణీత సమయంలో వీలైనంత ఎక్కువ రుణాలు అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వీరికి ఇది ఒకటే పని ఉన్నందున ప్రత్యేకంగా కృషి చేయవలసిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.
మోస్రా మండలంలో ఏపీఎం టీం 44 శాతంతో బాగా పనిచేస్తుందని ప్రశంసిస్తూ వారి తర్వాత వర్ని రెంజల్ రుద్రూర్ తదితర మండలాల్లో కూడా సంతృప్తికరంగా రుణాల మంజూరులో పని చేస్తున్నారన్నారు. మిగతా మండలాల్లో అధికారులు ఈ విషయంలో ఫోకస్ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
స్త్రీ నిధి పథకంలో రూ. 164 కోట్లకు గాను రూరల్ డిఆర్‌డిఎలో రూ. 19.71 కోట్లు లక్ష్యాన్ని ఇప్పటివరకు 71 శాతం సాధించి మెప్మాతో కలిపి రెండవ స్థానంలో మెప్మా లేకుండా మొదటి స్థానంలో ఉండటంపై అభినందించారు. రుణాల మంజూరుతోపాటు రుణాల రికవరీకి కూడా అధికారులు సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి సరిగా రికవర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్ఫరెన్సులో డిఆర్‌డిఓ చందర్ నాయక్, ఎల్‌డిఎం శ్రీనివాస రావు, ఏపీఎంలు ఏపీఓలు, తదితరులు పాల్గొన్నారు.