నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాధ, వీధి, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాల, బాలికల సంరక్షణ, పోషణ బాధ్యతలు సమష్టిగా నిర్వహిద్దామని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఛైర్మన్, ఇన్‌చార్జి జిల్లా జడ్జి ఎస్.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సంస్థ కార్యాలయం న్యాయ సేవా సదన్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రభుత్వ శాఖల స్టేక్ హోల్డర్స్‌తో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
న్యాయవ్యవస్థ, పోలీసుశాఖ, పిల్లల పోషణ, సంరక్షణ శాఖలు సమన్వయం చేసుకుని వారి భవిష్యత్తుకు గట్టి భరోసా ఇవ్వగలిగితే వారి భవిష్యత్ మార్గానికి డోకా ఉండదని తెలిపారు. కోవిడ్ వ్యాధి మూలంగా తల్లిదండ్రులు మరణించిన అనంతరం ఒంటరి అయిన పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, భారత సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల స్టేక్ హోల్డర్స్ ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన సూచించారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయివేటు పాఠశాలలో సంబంధిత పిల్లలను చేర్పించాలని ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వ, గురుకుల పాఠశాలకే ఇవ్వాలన్నారు. కరోనాతో కన్నుమూసిన వారి స్థిర, చర ఆస్తులను వారి పిల్లలపై బదిలీచేసి అధికారిక దృవపత్రాలను అందజేయాలని పేర్కొన్నారు.
వివిధ కారణాల వలన అనాథలైన వారి, నేరారోపణలకు గురైన పిల్లల ఫోటోలు, పేర్లు, విడియోలు దినపత్రికలలో ప్రచురించడం, టివి. ఛానల్స్, సోషల్ మీడియాలో పత్రిక, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు ప్రచురించరాదని, అలా ప్రచురిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ నేరం చేసిన వారు కాగలరని జిల్లా జడ్జి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. జర్నలిస్టు మిత్రులు ఈ విషయాలలో చాలా జాగరూకతతో ఉండాలని కోరారు.
సంరక్షణ కేంద్రాలలో ఉన్న బాల, బాలికలకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సన్నబియ్యాన్ని వండి పెట్టాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కృషి చేద్దామని అన్నారు. పిల్లల ఆలన, పాలనలో పొరపాటుకు తావు ఇవ్వరాదని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటు వారి బాగోగులు చూడాలని జిల్లా జడ్జి స్టేక్ హోల్డర్స్‌కు నిర్దేశించారు.
సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం, విక్రమ్, బాలల న్యాయమండలి ఛైర్‌పర్సన్, జూనియర్ సివిల్ జడ్జి సౌందర్య మాట్లాడుతూ పిల్లల అవసరాలకు అనుగుణంగా సమిష్టి, కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుదామన్నారు.
సమావేశంలో ఉమ్మడి జిల్లాల బాలల సంక్షేమ అధికారులు చైతన్యకుమార్, స్రవంతి, కార్మికశాఖ అధికారి మోహన్, సంబంధిత శాఖల అధికారులు రవి రాజేశ్వర్, సత్యనారాయణరెడ్డి, స్వర్ణలత, శ్రీలత, శోభారాణి, సంపూర్ణ, జానకి తదితరులు పాల్గొన్నారు.