నిజామాబాద్, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో హైదరాబాద్ రోడ్ నుండి గాయత్రి నగర్, చంద్ర నగర్, వివేకానంద నగర్, సాయి నగర్ వర్ని రోడ్డు వరకు ఉన్న వంద ఫీట్ల రోడ్డు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని, పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన అనేక మంది ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారని, అలాంటి వారందరూ ఈ రోడ్డు మూలంగా నిరాశ్రయులు అవుతారని, రింగ్ రోడ్డు బాధితుల కమిటీ ఆరోపించింది.
ఆదివారం రింగురోడ్డు బాధితుల కమిటీ సమావేశం జరిగింది. 1974 వ సంవత్సరంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో ఈ రోడ్డు హైదరాబాద్ రోడ్డు నుండి దాదాపు ఏడు కిలోమీటర్ల మేరకు రోడ్డు ఉన్నదని, దాదాపు యాభై సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు రోడ్డును మార్కింగ్ ఇవ్వలేదని ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాట్లు చేసి అమ్మేటప్పుడు గాని ఇడ్లు కట్టేటప్పుడు గాని మున్సిపల్ అధికారులు మౌనంగా ఉన్నారని, ఇప్పుడు యధాతధంగా ఆ రోడ్డు ని మాస్టర్ ప్లాన్‌లో చూపించటం అన్యాయం అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందులోనే వర్ని రోడ్డు నుంచి బోధన్ రోడ్డు వరకు ఉన్న మూడు కిలోమీటర్ల ముస్లిం మైనారిటీ వర్గాలు నివసించే రోడ్డును రద్దుచేసి, హైదరబాద్ రోడ్డు నుండి వర్ని రోడ్డు వరకు ఉన్న రోడ్డును యధాతధంగా ఉంచుటము వివక్షతతో కూడుకున్నదని వారన్నారు. అదేవిధంగా చంద్ర నగర్ 30 ఫీట్ల రోడ్డును 60 ఫీట్స్ చేస్తూ ప్రతిపాదించటం మూలంగా దాదాపు 70 ఇడ్లు నష్టపోవటం జరుగుతుందని వారన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఖరికి నిరసనగా ఆగస్టు 5వ తేదీ గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని కమిటీ నిర్ణయించిందని, కన్వీనర్ కె .రామ్మోహన్ రావు తెలిపారు. సమావేశంలో రాములు, అశోక్, నరసింహ స్వామి, రామ్ చందర్, రూప్ సింగ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.