నిన్ను కలిసాకే తెలిసింది
స్నేహం నిజస్వరూపం
నీతో మాట్లాడాకే వదిలింది
అనాదిగా నన్నంటి విడువనితాపం
కొన్నాళ్లక్రితం మనం అజ్ఞాతవాసులం
కానీ… ఇప్పుడు!
మన ఇరువురి చిరునామా ఒక్కటే
అదే స్నేహం
ఎడారి మొక్కలుగావుండే మనము
ఎల్లలు దాటిన అనుభూతిని
పొందుతామని
నేనెప్పుడూ
నా ఊహల పొలిమేరల్లోకి కూడా నేను అడుగుపెట్టలేదు
నా జీవనయానంలో
అటకెక్కించిన మధురస్మ ృతులు
ఎలా విప్పమంటావు! ఐనా
కొంతమేరకు ప్రయత్నిస్తా..
నేను పడిన కష్టాలలో పేరు మాత్రమే నాది
ఖర్మ అనుభవించేది నువ్వే
సంతోష సరోవరంలో నన్ను మాత్రం
తనివితీరా స్నానం చేయించేవాడివి
చేతిలో చిల్లిగవ్వ లేకున్నా
మనం పస్తులున్న క్షణాలను వెదకాలంటే
చాటంత భూతద్దం కావాలి
నా ఒంటరితనంలో తోడుగా
నా వెన్నంటే విడువని నీడగా
బహుశా.. నీ సగం జీవితాన్ని
నాకోసమే పణంగా పెట్టావనుకుంటా!
కల్మషాన్ని కాలదన్ని
నిత్యం ధైర్యాన్ని నూరిపోసే నీ నిర్భయత్వాన్ని
నేనేమని కీర్తించాలి!
మన స్నేహాన్ని మొత్తం మూటకడితే
అదొక మధురకావ్యం కాకమానదు
ఒకతరం చదువుకోవడానికి
పాఠ్యాంశం కాకమానదు
అమ్మను మరిపించే ఆప్యాయత
నాన్నను తలపించే నీ చేయూత
తడియారని ఇలాంటి
పచ్చిజ్ఞాపకాలనెన్నో తవ్వుతూ
ఇలా సాగిపోతున్నాను
నా మానసాకాశంలో
ధృవతారగా నిన్ను నిలబెట్టుకున్నాను
నువ్వు చెక్కిన ఈ నా వ్యక్తిత్వశిల్పం
నా అసమర్దతతో ఏ క్షణంలోనైనా
నవ్వులపాలు కాకుండా జాగ్రత్త పడుతున్నాను
ఐనా..ఇప్పుడు నువ్వులేవన్న
భయంకరమైన నిజాన్ని
అంతతేలికగా ఎలా చెప్పగలను!
నన్ను ఇంత రమణీయమైన విగ్రహంలా మలచిన వ్యక్తిత్వం నీదైనప్పుడు
నేను నువ్వేకదా! నేస్తం!!
సుప్పని సత్యనారాయణ.
సెల్ : 94926 26910