డిచ్‌పల్లి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్, డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు మేనేజర్ మధుసుదన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ప్రత్యూష డ్రైవ్ నిర్వహించారు.
కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు వచ్చిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గత రెండు సంత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల ఎందరో ఐటి సాఫ్ట్ వేర్, టెక్నికల్ తదితర రంగాలలో ఉద్యోగాలు కోల్పోయిన తరుణంలో కూడా ‘‘కెమినో టెక్’’ ఈ ఉద్యోగాల కోసం పిలుపునివ్వడం, ఏకంగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు ఇది చక్కని అవకాశమని ప్రశంసించారు.
ఎం.ఎస్సీ. కెమిస్ట్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు దాదాపు 100 మంది హాజరైనారు. వాతు తమ తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో క్యాంపస్ డ్రైవ్‌కు రాగా కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో పరీక్ష నిర్వహించారు. అత్యధిక ప్రతిభ చూపిన పి.సతీష్, ఎస్. శ్రీజ, పి. వెన్నెల, ఆర్. రవళి, బి. అశ్విన్, కె.రజిత, జి. రచన, డి. సృజన, డి. రాణి, ఎన్. అనూష, యు. ఆక్షయ్, బి. జెర్సన్, జి. వెంకటెష్ వంటి 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు.
ఉద్యోగ నియామక పత్రాలను వీసీ, రిజిస్ట్రార్ ఆచార్య నసీంలు విజయం పొందినవారికి అందించారు. క్యాంపస్ డ్రైవ్ ను ఆహ్వానించిన విభాగాధీపతి డా. జి. బాలకిషన్, సహకరించిన బిఓఎస్ డా. బి. సాయిలు, డా. ఎ. నాగరాజు, డా. రాజేశ్వరి, తదితర అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్స్, పరిశోధక విద్యార్థి క్రాంతి కుమార్‌ను అభినందించారు.