నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్‌లో జారీ చేసిన సర్కులర్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకున్నదని పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయించిందని జులై 15న ఉత్తర్వులు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద ‘పిల్’ ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ గతంలో జారీ చేసిన సర్కులర్లను రద్దు చేసినట్లు, పాత వేతనాలను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది, హైకోర్టుకు విన్నవించింది. కానీ పాత వేతనాలను కొనసాగించే ఆ సర్కులర్‌ను ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్‌లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్కులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు.